71 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా 'పెద్దన్న'ను ఒప్పించలేకపోయారు: రేవంత్ పై కేటీఆర్ ఫైర్

  • హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు అనుమతులు తేలేకపోవడం రేవంత్ ప్రభుత్వ వైఫల్యమేనన్న కేటీఆర్
  • ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణ
  • మెట్రో వైఫల్యంపై సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు సాధించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ఆయన సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సీఎం నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

యూపీ, అహ్మదాబాద్, విశాఖపట్నం వంటి నగరాలకు కేంద్రం మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తేలేకపోయారో రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 71 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా తన 'పెద్దన్న'ను (మోదీ) ఒప్పించలేకపోవడం ఆయన చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనమని ఎద్దేవా చేశారు.

ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తోందన్న భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే మెట్రో విస్తరణను నిరాకరిస్తున్న ప్రధానిని, కేంద్రాన్ని విమర్శించే ధైర్యం, దమ్ము ఆయనకు లేవని అన్నారు. కేసీఆర్ సమర్థ నాయకత్వంలో ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వస్తే, ఈ అసమర్థ పాలనలో అన్నీ నిలిచిపోయాయని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

ఢిల్లీలో తనను 'చెప్పుల దొంగ'లా చూస్తున్నారని రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పడం ఆయన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని కేటీఆర్ అన్నారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును సాధించడంలో విఫలమైనందుకు సీఎం తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 'మినీ ఇండియా' లాంటి హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం కావడం ఖాయమని హెచ్చరించారు.

KTR
Revanth Reddy
Hyderabad Metro Rail Phase 2
Telangana Congress Government
Delhi Visits
BRS vs Congress

More Telugu News